తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను దుర్భాషలాడటంపై ఆయన ఈసీఐకు ఫిర్యాదు చేశారు.
నిరంజన్ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం స్పందించింది. కాంగ్రెస్ నేతలపై దుర్భాలాడటంపై గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఈసీఐ. ఈసీ నోటీసులపై కేసీఆర్ రేపు ఉదయం లోగా వివరణ ఇవ్వాల్సి ఉంది. మరి దీనిపై కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి.
ఇక మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ వద్ద నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్.. కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోగా కూలిపోతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లైనా కాకుండానే ప్రజలు తిరగబడుతున్నారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏ క్షణానైనా పార్టీ మారొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణను సాధించినట్లే.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి.. సుపరిపాలన అందిస్తామన్నారు.