బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల రైతులు పూర్తిస్థాయిలో లబ్ధి పొందలేకపోయారని భావిస్తున్న కేసీఆర్.. ప్రజల్లోకి వెళ్లి రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయిన కేడర్‌లో ఉత్తేజం నింపేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వంటి వాటితో బీఆర్ఎస్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. దీనికితోడు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉనికి కోసం బీఆర్ఎస్ పోరాడుతోంది. పార్టీ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్నప్పటికీ పెద్దగా స్పందన రావడం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ జిల్లాల పర్యటనకు రెడీ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.