UPDATES  

NEWS

 అరబ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. గల్ఫ్ దేశాల మౌనం వెనుక మర్మమేంటి..?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతరం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు దుబాయ్, అబుదాబి వంటి నగరాలపై పడుతున్నప్పటికీ, సౌదీ అరేబియా, యూఏఈ వంటి శక్తిమంతమైన గల్ఫ్ దేశాలు ఎదురుదాడికి దిగకుండా మౌనం పాటిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక వైఖరి వెనుక బలమైన ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

గల్ఫ్ దేశాలు ప్రస్తుతం తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురుపై ఆధారపడకుండా పర్యాటకం, వాణిజ్య కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే, దశాబ్దాలుగా నిర్మించుకున్న అభివృద్ధి క్షణాల్లో కుప్పకూలుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే దుబాయ్ విమానాశ్రయం సమీపంలో దాడులు జరగడంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. యుద్ధం మొదలైతే తమ చమురు క్షేత్రాలు, ఓడరేవులే ప్రధాన లక్ష్యంగా మారతాయని అరబ్ పాలకులు అంచనా వేస్తున్నారు.

 

మరోవైపు, ‘ముస్లిం ఉమ్మా’ (ఐక్యత) సెంటిమెంట్ కూడా వారిని నిలువరిస్తోంది. ఇరాన్ షియా దేశమైనప్పటికీ, అది ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికాలను వ్యతిరేకిస్తోంది. ఈ తరుణంలో ఇరాన్‌పై దాడి చేస్తే, తాము ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నామనే సందేశం వెళ్తుందని అరబ్ దేశాలు భావిస్తున్నాయి. ఇది సొంత ప్రజల్లోనే తీవ్ర వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది.

 

అంతేకాకుండా, ఇరాన్ ఉచ్చులో చిక్కుకోకూడదని కూడా గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. తమను రెచ్చగొట్టి యుద్ధంలోకి లాగడం ద్వారా అమెరికాపై ఒత్తిడి పెంచాలన్నది ఇరాన్ వ్యూహంగా అనుమానిస్తున్నాయి. అందుకే, క్షిపణి దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలతోనే అడ్డుకుంటున్నాయి తప్ప, తిరిగి ఇరాన్ భూభాగంపై దాడులకు దిగడం లేదు. ఈ వివాదాన్ని ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్యనే పరిమితం చేయాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |