UPDATES  

NEWS

 గల్ఫ్ తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం అండ….

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారి భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేరకు విదేశాల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా ఉంచేందుకు ప్రభుత్వం క్లోజ్ మానిటరింగ్ చేస్తోంది. దీనికోసం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (Andhra Pradesh Bhavan) లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని ప్రతి దేశంలో తెలుగు కోఆర్డినేటర్లను సిద్ధంగా ఉంచారు. బాధితులకు తక్షణ సహాయం అందించడానికి 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది.

 

ప్రస్తుతం యుద్ధం కారణంగా జోర్డన్, బెహరిన్, యూఏఈ, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ కువైట్ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే సౌదీ అరేబియా, ఒమాన్ దేశాల్లో విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. పరిస్థితులు స్థిరపడితే మిగిలిన దేశాల్లో కూడా సర్వీసులు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లో సుమారు లక్షకు పైగా తెలుగు వారు ఏపీ ఎన్ఆర్టీలో రిజిస్టర్ చేసుకోగా.. మరో 5 నుండి 7 లక్షల వరకు రిజిస్టర్ కాని వారు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీసా గడువు ముగిసిన వారికి కూడా కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసి అవసరమైన సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

 

సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే బెహరిన్ ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కున్న ఆరుగురు తెలుగు వారికి ప్రభుత్వం వసతి కల్పించింది. దుబాయ్‌లో చిక్కుకున్న మరో 10 మందికి తక్షణ సాయం అందించారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు, హోటళ్లు, ఫుడ్ సపోర్ట్ ద్వారా తెలుగు వారిని సేఫ్ జోన్లలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒమాన్ తీరంలో జరిగిన ఆయిల్ ట్యాంకర్ ఘటనలో తెలుగు వారు ఎవరూ లేరని ప్రభుత్వం స్పష్టం చేయడం ఊరటనిచ్చే అంశం. తెలుగు ప్రజలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే భయపడకుండా వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ తెలుగు ప్రజల వెంట ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.

 

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారు కింది నంబర్లను సంప్రదించవచ్చు.

 

ఏపీ భవన్ (ఢిల్లీ): 9871999430

ఏపీ ఎన్ఆర్టీ (APNRT): 0863-2340678

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |