UPDATES  

NEWS

 బ్లూ జెట్ హెల్త్ కేర్ శంకుస్థాపన: ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రముఖ ఫార్మా దిగ్గజం బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ (BJHL) గ్రీన్‌ఫీల్డ్ తయారీ యూనిట్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటువుతున్న ఈ పరిశ్రమ ద్వారా 1,750 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా.. మొత్తంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, పరిశ్రమలు క్షేత్రస్థాయిలో వేగంగా ఏర్పాటయ్యేలా (గ్రౌండింగ్) చూడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ఈ సందర్భంగా లోకేశ్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై ఉన్న ‘విశ్వసనీయత’, మరియు కేంద్ర-రాష్ట్రాల ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ప్రధాన కారణాలని మంత్రి విశ్లేషించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఇందుకోసం గూగుల్, టీసీఎస్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాంబిల్లిలో 102 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా, అనుమతులన్నీ శరవేగంగా మంజూరు చేసినట్లు వెల్లడించారు.

రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా అని లోకేశ్ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడి ప్రతిపాదనల్లో 25.3 శాతం ఏపీకే రావడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని ఆయన గర్వంగా ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కొత్త యూనిట్‌లో ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారని, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ఒక ‘వాట్సాప్ మెసేజ్’ దూరంలో ఉంటూ సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |