మహబూబ్‌నగర్ పట్టణంలోని వాసవి డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు మేరకు “అర్రైవ్ అలైవ్” (Arrive Alive) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డి.జానకి, సుమారు 400 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువతలో రోడ్డు నియమాలపై సరైన అవగాహన ఉంటేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే సురక్షిత సమాజం సాధ్యమవుతుందని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు డిఫెన్సివ్ డ్రైవింగ్ (Defensive Driving) ప్రాముఖ్యతను వివరించారు. వాహనం నడిపేటప్పుడు కేవలం తన జాగ్రత్తే కాకుండా, ఎదుటివారి తప్పిదాలను కూడా ముందుగానే ఊహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతివేగం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి ప్రాణాంతకమని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం నుంచి తప్పుకోవచ్చని స్పష్టం చేశారు.
భారీ వాహనాల సమీపంలో ప్రయాణించేటప్పుడు బ్లైండ్ స్పాట్స్ (Blind Spots) పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరమని ఎస్పీ విద్యార్థులకు వివరించారు. పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల తీరును, వాటి వెనుక ఉన్న నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. యువత రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే వారి కుటుంబాలకు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ కొండా స్వామి, షీ టీమ్ సభ్యులు మరియు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.








