UPDATES  

NEWS

 ఏపీ లిక్కర్ స్కామ్: ఎట్టకేలకు సిట్ ముందు లొంగిపోయిన ఏడో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి మంగళవారం సాయంత్రం విజయవాడలోని సిట్ (SIT) అధికారుల ఎదుట లొంగిపోయారు. గత ఏడాది కాలంగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న ఆయన, తన న్యాయవాదితో కలిసి వచ్చి అధికారులకు సరెండర్ అయ్యారు. తన సోదరుడి అరెస్ట్ తర్వాత తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాష్ రెడ్డి దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ కాగా, ఏడాది పాటు ఆయన విదేశాల్లోనే అజ్ఞాతంలో గడిపారు.

అవినాష్ రెడ్డి లొంగుబాటుకు సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అంతకుముందు జనవరి 29న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించగా, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, ఫిబ్రవరి 26న శ్రీలంక నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన న్యాయవాది కోరారు. అయితే, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ సూర్యాకాంత్ ధర్మాసనం.. “ఏడాది కాలంగా పరారీలో ఉండి, చట్టాన్ని ఏమార్చే వ్యక్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేసింది. ముందు లొంగిపోతేనే బెయిల్ పిటిషన్లను పరిశీలిస్తామని తేల్చి చెప్పడంతో ఆయనకు మార్గం సుగమం కాలేదు.

సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడంతో ఇక తప్పించుకునే మార్గం లేక అవినాష్ రెడ్డి అధికారుల ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. ఏడాది కాలంగా సాగుతున్న ఈ దాగుడుమూతల పర్వానికి తెరపడటంతో, ఇప్పుడు అవినాష్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సంస్థలు ఈ కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలను వెలికితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లొంగుబాటుతో ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ మరింత వేగవంతం కానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |