UPDATES  

NEWS

 రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాలపై బొలిశెట్టి సత్యనారాయణ సంచలన ట్వీట్: కాలుష్యమే అసలు కారణమా?

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ దుర్ఘటనపై జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం పాల వల్ల జరిగిన మరణాలేనా లేక నీటి కాలుష్యం వల్ల సంభవించాయా అన్న కోణంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని అభినందిస్తూనే, కేవలం పాలపైనే నెపం నెట్టి అసలు కారణాలను విస్మరించవద్దని సూచించారు.

గోదావరి నది కాలుష్యంపై తాను నాలుగేళ్ల క్రితమే ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్ర సింగ్‌తో కలిసి పర్యటించానని, స్థానిక పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాలు నదిని విషతుల్యం చేస్తున్నాయని బొలిశెట్టి గుర్తు చేశారు. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడాన్ని ఆయన ఉదహరించారు. జల, వాయు, భూగర్భ కాలుష్యాలే ఇలాంటి అకాల మరణాలకు మూల కారణమని, దీనిపై పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం కేవలం పరిహారంతో సరిపెట్టకుండా, కాలుష్య నియంత్రణ మండలిని (PCB) క్షేత్రస్థాయిలో కఠినంగా పనిచేయించాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. తప్పుడు ల్యాబ్ రిపోర్టులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, గోదావరిని కాపాడుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కాలుష్య నివారణే ప్రజల ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |