UPDATES  

NEWS

 భక్తులకు గుడ్ న్యూస్: ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు.. రూ.151తో బుకింగ్ షురూ!

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకే చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో చేపట్టిన ఈ పవిత్ర కార్యం వరుసగా నాలుగో ఏడాది కూడా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి, ఐపీఎస్ గారు ఇందుకు సంబంధించిన గోడ పత్రికను (పోస్టర్) ఆవిష్కరించి, బుకింగ్ వివరాలను వెల్లడించారు.

శ్రీరామ నవమి రోజున స్వామివారి కల్యాణంలో ఉపయోగించే అత్యంత విశిష్టమైన తలంబ్రాలను పొందాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 23 (సోమవారం) నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. భక్తులు ఆన్‌లైన్‌లో www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్ ద్వారా గానీ లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద నేరుగా గానీ తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు. మార్చి 27న భద్రాద్రిలో కల్యాణోత్సవం పూర్తయిన తర్వాత భక్తుల ఇళ్లకు వీటిని హోం డెలివరీ చేస్తారు.

నియమ నిష్టలతో గోటితో ఒలిచిన కోటి బియ్యం గింజలను ఈ తలంబ్రాల కోసం ఉపయోగిస్తారని, ఈ సేవకు భక్తుల నుంచి గత మూడేళ్లుగా విశేష స్పందన లభిస్తోందని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. భద్రాద్రికి నేరుగా వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తలంబ్రాల బుకింగ్ లేదా ఇతర వివరాల కోసం భక్తులు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033 లేదా 040-69440069 సంప్రదించవచ్చు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |