తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ మరియు ‘సూపర్ సెవెన్’ హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం కేవలం 4.25 శాతం మాత్రమే వృద్ధి చెందిందని, సొంత ఆదాయాల వృద్ధిలో ఏపీ దేశంలోనే 22వ స్థానంలో ఉందని కాగ్ (CAG) నివేదికను ఉటంకిస్తూ విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆదాయం 45 శాతం పెరుగుతుందని బడ్జెట్‌లో చూపించడం హాస్యాస్పదమని, ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన మండిపడ్డారు.
ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంపై ధ్వజమెత్తుతూ, రాష్ట్ర సంపద “బాబు అండ్ కో” జేబుల్లోకి వెళ్తోందని జగన్ ఆరోపించారు. “దోచుకో.. దాచుకో.. పంచుకో” అనే విధానం రాష్ట్రంలో అమలవుతోందని, అప్పుల వివరాలను పారదర్శకంగా బడ్జెట్‌లో చూపించలేదని ఆయన పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే పథకం మరియు నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలకు నిధుల కేటాయింపులు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
మంత్రి నారా లోకేశ్‌పై కూడా జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రజల సొమ్ముతో విలాసవంతమైన ప్రైవేటు విమానాల్లో తిరుగుతూ కొలంబో, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ జల్సాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఉపముఖ్యమంత్రి అందరూ గాల్లోనే విమానాల్లో ఉంటున్నారని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదని జగన్ విమర్శించారు. బడ్జెట్ అనేది అంకెల గారడీగా మారిందని, ఇది కేవలం పబ్లిసిటీ కోసమే తప్ప పెర్ఫార్మెన్స్ కోసం కాదని ఆయన తేల్చి చెప్పారు.








