UPDATES  

NEWS

 రాజోలులో ‘కూటమి’ కోల్డ్ వార్: జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంచార్జ్

జనసేన పార్టీకి కంచుకోటగా భావించే రాజోలు నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు సెగలు పుట్టిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో జనసేనను ఆదరించిన ఈ గడ్డపై, ఇప్పుడు కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన, టీడీపీల మధ్య ‘కోల్డ్ వార్’ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు తీరుపై టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస సమాచారం ఇవ్వకపోవడం, నామినేటెడ్ పదవుల భర్తీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు.

ముఖ్యంగా అంతర్వేది ఆలయ కమిటీ ఛైర్మన్ నియామకం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. టీడీపీ నేతకే పదవి ఇచ్చామని ఎమ్మెల్యే చెబుతున్నా, తన ప్రమేయం లేకుండా తనకు వ్యతిరేక వర్గానికి ఆ పదవి కట్టబెట్టారని అమూల్య ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఒక ఇంచార్జ్ ఉన్నారన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆమె వర్గీయులు వాపోతున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే వరప్రసాదరావు మాజీ ఐఏఎస్ అధికారి కావడం, అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం వల్ల జిల్లా స్థాయి నేతలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వెనకాడుతున్నట్లు సమాచారం.

కేవలం టీడీపీతోనే కాకుండా, జనసేన పార్టీ అంతర్గతంగా కూడా ఎమ్మెల్యేపై అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారిని కాదని, వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాత కాపులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి ఈ విభేదాలు చేరాయి. అటు టీడీపీలో కూడా అమూల్య ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఒక వర్గం ఆరోపిస్తుండటంతో, రాజోలు రాజకీయం ఇప్పుడు అటు కూటమి లోపల, ఇటు పార్టీల లోపల రసవత్తరంగా మారింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |