ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేమ బంధాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ మనసు విప్పారు. తన రాబోయే చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా ఆమె మాట్లాడుతూ, నేటి కాలంలో ప్రేమలో అతిపెద్ద సమస్య ‘కమ్యూనికేషన్’ అని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ వల్ల అంతులేని అవకాశాలు అందుబాటులోకి రావడంతో బంధాలలో అలసట పెరిగిందని, దీనివల్ల సంబంధాలు చాలా పెళుసుబారిపోతున్నాయని ఆమె విశ్లేషించారు.
పాతతరం ప్రేమలోని స్వచ్ఛతను నటి భాగ్యశ్రీ ఉదాహరణతో మృణాల్ వివరించారు. భాగ్యశ్రీ గారు తన ప్రేమకథ గురించి చెబుతూ.. ఆ రోజుల్లో వారానికి ఒక్కసారి వచ్చే ఫోన్ కాల్ కోసం పీసీఓల వద్ద గంటల తరబడి ఎదురుచూసేవారట. ఆ నిరీక్షణలో ఒక రకమైన మాధుర్యం, ఒకరి సమయానికి మరొకరు ఇచ్చే విలువ ఉండేవని మృణాల్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకునే వీలుండటంతో, ఆనాటి నిరాడంబరమైన ప్రేమలో ఉన్న గాఢత తగ్గిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక వృత్తిపరమైన సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ, నటీనటులుగా తాము పోషించే కొన్ని డార్క్ రోల్స్ ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడే అవకాశం ఉంటుందని మృణాల్ తెలిపారు. షూటింగ్ ముగిశాక ఆ పాత్రల తాలూకు మానసిక స్థితిని ఇంటికి తీసుకురాకుండా ఉండటం చాలా కష్టమైన విషయమని ఆమె పేర్కొన్నారు. సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలో నటించిన ‘దో దీవానే షెహర్ మే’ చిత్రం ఫిబ్రవరి 20, 2026న విడుదల కానుంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉండటం విశేషం.








