ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించే విభాగాలకు సింహభాగం నిధులు దక్కాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖకు రూ. 32,308 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1,500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించగా, ఉన్నత విద్యాశాఖకు రూ. 2,567 కోట్లు మరియు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు రూ. 1,232 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల కుంటుపడిన విద్యా రంగాన్ని ‘మెగా డీఎస్సీ’ వంటి చర్యలతో మళ్ళీ గాడిలో పెడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత లభించింది. ఏపీ గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో ఈ శాఖకు రూ. 22,942 కోట్లు భారీగా కేటాయించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిధులు తోడ్పడనున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి హామీ పనులు మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఈ నిధులను వెచ్చించనున్నారు.
పర్యావరణం మరియు అటవీ శాఖల అభివృద్ధికి కూడా బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత కల్పించారు. పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలోని పర్యావరణ, అటవీ మరియు శాస్త్రసాంకేతిక శాఖకు రూ. 714 కోట్లు కేటాయించారు. 2030 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని 37 శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ మరియు అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తామని ప్రభుత్వం వివరించింది.








