ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గళమెత్తారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, “అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒక న్యాయం.. మీ తల్లిని అంటే ఒక న్యాయమా?” అంటూ సూటిగా ప్రశ్నించారు. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా అది తప్పేనని, కేవలం రాజకీయ మైలేజీ కోసం మహిళలను రోడ్డుపైకి తీసుకురావడం సరికాదని ఆయన మండిపడ్డారు.
అంబటి రాంబాబు తల్లిని కొందరు వ్యక్తులు అత్యంత జుగుప్సాకరంగా తిట్టిన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని, అలాంటి దాడులు జరిగినప్పుడే ఎవరైనా ఘాటుగా స్పందిస్తారని బొత్స వివరించారు. అంబటి విజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టే తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారని గుర్తుచేశారు. కానీ, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితుడిని వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
గతంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడులను కూడా ప్రస్తావిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు కేవలం కక్షసాధింపు చర్యలని బొత్స విమర్శించారు. అంబటి రాంబాబును అక్రమంగా వేధిస్తున్న వారంతా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు ఉండాలి కానీ, ఇలా తల్లిదండ్రులను దూషించడం మరియు వ్యక్తిగత దాడులకు దిగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంప్రదాయం కాదని ఆయన ప్రభుత్వానికి స్పష్టం చేశారు.








