UPDATES  

NEWS

 శ్రీకాళహస్తిలో అరుణాచలం తరహా గిరి ప్రదక్షిణ: భక్తులకు పవన్ కళ్యాణ్ మహాశివరాత్రి కానుక!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు తీపి కబురు అందించారు. తమిళనాడులోని అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తి ఆలయంలో కూడా ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గతంలో పాలక మండళ్ల నిర్లక్ష్యం వల్ల ఆలయాల్లో కొన్ని అపచారాలు జరిగాయని గుర్తుచేసిన ఆయన, ఇకపై అలాంటి తప్పులు జరగకుండా భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రాల ప్రతిష్టను పెంచేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పాలక మండళ్లకు సూచించారు.

శ్రీకాళహస్తిలోని గిరి ప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రూ. 10 కోట్లతో సిమెంట్ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర సాగే ఈ కైలాసగిరి ప్రదక్షిణ మార్గం ఇరువైపులా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక అనుభూతి లభించాలని ఆయన ఆకాంక్షించారు.

కేవలం శ్రీకాళహస్తి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి రూ. 40 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు కోటప్పకొండ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. దేవాదాయ మరియు పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఆలయాల వద్ద మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, దీనివల్ల రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |