UPDATES  

NEWS

 ఏపీలో మరో స్పేస్ హబ్: నెల్లూరు జిల్లాలో రూ.1000 కోట్లతో రాకెట్ పరిశోధన కేంద్రం!

ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష పరిశోధనలకు చిరునామాగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా దత్తలూరు మండలంలో సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో రాకెట్ పరిశోధన కేంద్రం (Space Research Centre) ఏర్పాటుకు ‘ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్’ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే శ్రీహరికోటలో ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉండగా, దానికి సమీపంలోనే ఈ ప్రైవేట్ పరిశోధన కేంద్రం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ప్రాజెక్టు కోసం దత్తలూరు మండలంలోని రాచవారిపల్లి, బ్రహ్మశ్వరం రెవెన్యూ పరిధిలో గల భూములను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ఈ కేంద్రం స్థాపన ద్వారా రాకెట్ సాంకేతికత మరియు అంతరిక్ష పరిశోధనల్లో అత్యాధునిక వృద్ధి సాధ్యం కానుంది. గతేడాది డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడుల కోసం కుదిరిన ఒప్పందాల కొనసాగింపుగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనివల్ల నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో పాటు, స్థానిక యువతకు భారీస్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

కేవలం నెల్లూరు మాత్రమే కాకుండా, కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్‌లో కూడా ‘స్పేస్ పోర్ట్’ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. ‘స్పేస్ సిటీ’ ప్రాజెక్టులో భాగంగా ప్రైవేట్ రాకెట్ లాంచ్ మిషన్లకు మద్దతు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దేశంలో అంతరిక్ష వాణిజ్యం వేగంగా పుంజుకుంటున్న తరుణంలో, ఇస్రోతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఏపీని గ్లోబల్ స్పేస్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |