సుహాస్, శివానీ నగరం ప్రధాన పాత్రల్లో నటించిన ‘హే భగవాన్’ చిత్ర ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుక జరిగిన రోజు ‘హగ్ డే’ (వాలంటైన్స్ వీక్) కావడంతో, వేదికపై ఉన్న పురుషులందరినీ నరేష్ గారు ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. అయితే హీరోయిన్ శివానీ నగరం, యాంకర్ స్రవంతి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆగిపోయి, తనదైన శైలిలో చమత్కరించారు.
“మిమ్మల్ని కూడా హగ్ చేసుకుందామనే వచ్చాను, కానీ మీరు లక్షణంగా చీరలు కట్టుకుని వచ్చారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల తర్వాత చాలామంది స్టేజీలపై చీరల్లోనే కనిపిస్తున్నారు” అని నరేష్ వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు ఆడవాళ్లను హగ్ చేసుకోకూడదని, అందుకే మీరిద్దరే ఒకరినొకరు హగ్ చేసుకోండి అంటూ ఆయన సరదాగా అన్నారు. అలాగే హగ్ డే రోజు ట్రైలర్ లాంచ్ పెట్టారని, అదే ‘కిస్ డే’ రోజు పెట్టుంటే ఇంకా బాగుండేదని ఆయన చేసిన కామెంట్స్ అక్కడ నవ్వులు పూయించాయి.
ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే నరేష్ గారు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ‘హే భగవాన్’ సినిమా ఒక హోల్సమ్ ఎంటర్‌టైనర్ అని, ఫిబ్రవరి 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నరేష్ ఒక కీలక పాత్ర పోషించారు.








