తమిళ సినీ దర్శకుల సంఘం (Tamil Nadu Film Directors Association) అధ్యక్షుడిగా సీనియర్ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఈ సంఘానికి కార్యదర్శిగా సేవలందించిన ఆయన, ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్నారు. సెల్వమణి ప్రముఖ నటి, మాజీ మంత్రి రోజా భర్త అన్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు సంఘంలోని ఇతర కీలక పదవులకు కూడా ప్రముఖ దర్శకులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఈ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా దక్షిణాది టాప్ దర్శకులు కేఎస్ రవికుమార్, పి. వాసు ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా ఆర్వీ ఉదయకుమార్, కోశాధికారిగా పేరరసు ఏకగ్రీవంగా బాధ్యతలు స్వీకరించారు. కోలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన ఈ సంఘానికి కీలక నేతలు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం విశేషం.
మొత్తం 1,800 మంది సభ్యులున్న ఈ సంఘంలో మిగిలిన 5 జాయింట్ సెక్రటరీ మరియు 17 కార్యవర్గ సభ్యుల పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. రిటైర్డ్ న్యాయమూర్తి తర్వీశ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. కీలక బాధ్యతలు చేపట్టిన ఆర్కే సెల్వమణి బృందం, తమిళ దర్శకుల సంక్షేమం మరియు పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలతో ముందుకు సాగనుంది.








