తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుదారులు అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత అనుచరులు సొంతం చేసుకున్నారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, కవిత మద్దతుదారులు ఏకంగా 8 వార్డుల్లో ఘనవిజయం సాధించి మున్సిపాలిటీపై పట్టు సాధించారు. మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ తలో సీటును గెలుచుకున్నాయి. సొంత పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన కవితకు ఈ విజయం రాజకీయంగా పెద్ద ఊరటను ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి కవిత ఇంకా సొంత పార్టీని ప్రకటించకపోవడంతో, తన మద్దతుదారులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున బరిలోకి దించారు. ‘సింహం’ గుర్తుపై స్వతంత్ర పంథాలో పోటీ చేసిన అభ్యర్థులకు కవిత పూర్తి స్థాయిలో సహకారం అందించారు. క్షేత్రస్థాయిలో కవితకు ఉన్న ఆదరణ, తెలంగాణ జాగృతి ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు ఈ ఏకపక్ష విజయానికి దోహదపడ్డాయని గెలిచిన అభ్యర్థులు వెల్లడించారు. వడ్డేపల్లి ఫలితాలు రాగానే కవిత అనుచరులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. 43 మున్సిపాలిటీల ఫలితాలు రాగా, అందులో కాంగ్రెస్ 36 స్థానాలను కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది. నల్గొండ వంటి ప్రధాన కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇలాంటి హోరాహోరీ పోరులోనూ కవిత మద్దతుదారులు ఒక మున్సిపాలిటీని సొంతం చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








