UPDATES  

NEWS

 కుక్కపిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క.. మూగజీవాలను హింసిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శనివారం ‘డాగ్ అడాప్షన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ మరియు ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మానవత్వాన్ని చాటుకుంటూ, ఇండియన్ బ్రీడ్‌కు చెందిన ఒక కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ, రేణుకా చౌదరి చేతుల మీదుగా ఆ కుక్కపిల్లను స్వీకరించిన సీతక్క, ప్రతి ఒక్కరూ స్వదేశీ కుక్కలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడిన మంత్రి సీతక్క, కుక్కల పట్ల క్రూరంగా వ్యవహరించేవారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కుక్కలను సామూహికంగా చంపిన ఘటనలపై ఆమె తీవ్రంగా స్పందించారు. “ప్రతి ప్రాణికి ఈ భూమిపై జీవించే హక్కు ఉంది. కుక్కలను చంపడం నేరం, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది” అని ఆమె స్పష్టం చేశారు. మూగజీవాల పట్ల అమానవీయంగా ప్రవర్తించేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు.

కుక్క విశ్వాసానికి, రక్షణకు మారుపేరు అని, పూర్వం గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒక కుక్క ఉండేదని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితుల్లో కూడా కుక్క తన యజమాని పట్ల ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని కొనియాడారు. వీధి కుక్కలను హింసించకుండా, వాటికి ఆహారం అందిస్తూ ప్రేమతో చూసుకోవాలని, అప్పుడే సమాజంలో మానవత్వం పరిమళం విరజిమ్ముతుందని సీతక్క పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ అడాప్షన్ ప్రక్రియను ఆమె అభినందిస్తూ, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |