UPDATES  

NEWS

 మహాశివరాత్రి వేళ వికృత చేష్టలు: శివుడికి గంజాయి ప్రసాదంపై సీపీ సజ్జనార్ సీరియస్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొందరు యువకులు చేసిన వికృత చేష్టలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శివుడికి గంజాయిని ప్రసాదంగా పెడుతున్నామంటూ కొందరు యువకులు సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేశారు. అందరూ కొబ్బరికాయలు కొడితే, తాము శివుడికి ఇష్టమైన “కొత్త ప్రసాదం” పెడుతున్నామంటూ గంజాయిని ప్రదర్శించడం కలకలం సృష్టించింది. భక్తి ముసుగులో మత్తు పదార్థాలను ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. కేవలం సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ఇలాంటి పనులు సాహసం అని భ్రమపడొద్దని, ఇవి నేరుగా కటకటాల వెనుకకు నెట్టే తీవ్రమైన నేరాలని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తును పాడుచేసుకునే ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.

ముఖ్యంగా NDPS చట్టం కింద కేసులు నమోదైతే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుందని సజ్జనార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాను సృజనాత్మకతకు వేదికగా మార్చుకోవాలి తప్ప, చట్టవ్యతిరేక పనులకు కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వెకిలి చేష్టలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో, ఇలా బహిరంగంగా గంజాయిని ప్రదర్శించడంపై పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |