తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. గతంలో “హ్యాపీ బర్త్ డే డాడీ” అంటూ ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు తెలిపే కవిత, ఈసారి మాత్రం కేవలం ఒకే ఒక్క లైన్‌లో విషెస్ చెప్పి ముగించారు. “ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు” అని ఆమె పేర్కొన్నారు. ఇందులో కనీసం తండ్రి అని ప్రస్తావించకపోవడం, ఆయనతో కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేయకపోవడం గమనార్హం.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణులు మరియు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సొంత తండ్రికి ఇతర రాజకీయ నాయకులు చెప్పినట్లుగా శుభాకాంక్షలు తెలపడం ఏంటని వారు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. గతంలో ఆమె చేసిన ప్రేమపూర్వక ట్వీట్లను ఇప్పుడు ప్రస్తుత ట్వీట్‌తో పోల్చుతూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. కవిత వైఖరిని చూస్తుంటే కేవలం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్లుగా ఉందని, కుటుంబానికి మరియు పార్టీకి ఆమె ఎంతలా దూరమయ్యారో ఈ ట్వీట్ స్పష్టం చేస్తోందని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుండి కవిత ప్రవర్తనలో భారీ మార్పులు వచ్చాయి. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ నుండి సస్పెండ్ కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, తండ్రి పుట్టినరోజున ఆమె వ్యవహరించిన తీరు రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.








