UPDATES  

NEWS

 తెలంగాణ యంగెస్ట్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య: 24 ఏళ్లకే బాధ్యతలు!

తెలంగాణ రాష్ట్రంలోనే అతి పిన్న వయస్కురాలైన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కేవలం 24 ఏళ్ల వయస్సులోనే ఆమె వికారాబాద్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించారు. అనన్య తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె కావడం విశేషం. వికారాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసిన ఆమె, భారీ మెజారిటీతో విజయం సాధించిన అనంతరం ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, అనన్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. లయోలా అకాడమీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన ఆమె, కేవలం తన తండ్రి వారసత్వాన్ని మోయడమే కాకుండా.. సొంత కార్యాచరణతో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. వికారాబాద్‌లోని ప్రాథమిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

యువత రాజకీయాల్లోకి రావడం వల్ల మార్పు వేగంగా జరుగుతుందని అనన్య అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, వికారాబాద్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యిందని, ప్రజల సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఒక బాధ్యతాయుతమైన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా, కుమార్తెగా తన తండ్రికి అండగా ఉంటూ వికారాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆమె పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |