అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ (30) విగతజీవిగా కనిపించాడు. బుధవారం (ఫిబ్రవరి 18, 2026) ఉదయం కురుబలకోట మండలం కనసానివారిపల్లి సమీపంలోని ఒక చెరువులో అతని మృతదేహం తేలియాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత మనస్తాపంతో లేదా శిక్ష తప్పదనే భయంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె. ధీరజ్ ప్రాథమికంగా ధృవీకరించారు.
సోమవారం రాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్యాచారం చేసిన అనంతరం తన ఇంట్లోని వాటర్ డ్రమ్ములో మృతదేహాన్ని దాచిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రక్షక్ వాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా, అతను మార్గమధ్యంలో తప్పించుకుని పరారయ్యాడు. అతని కోసం పోలీసులు డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లతో భారీ గాలింపు చేపట్టగా, చివరికి చెరువులో శవమై తేలాడు.
నిందితుడి మరణవార్త తెలియడంతో మదనపల్లెలో స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. “రాక్షసుడికి తగిన శాస్తి జరిగిందని”, “చిన్నారి ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుందని” వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిందితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.








