కాంగ్రెస్ పార్టీలో పదవుల కేటాయింపులో ఎలాంటి కోటాలు ఉండవని, కేవలం ‘మెరిట్ కోటా’ మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షులు తమను జిల్లాకు అధిపతులుగా భావించవద్దని, అందరినీ కలుపుకుని పోవడమే అసలైన విజయమని సూచించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి మద్దతు కోరడం వల్లే పార్టీ ఓటు బ్యాంకు 2 శాతం నుండి 40 శాతానికి పెరిగి అధికారంలోకి రాగలిగామని ఆయన గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కోసం కష్టపడుతున్నారని, అదే స్ఫూర్తితో డీసీసీ అధ్యక్షులు నిరంతరం ప్రజల్లో ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో బీసీ, ఓబీసీలకు పెద్దపీట వేయడం కాంగ్రెస్ సాధించిన సామాజిక విజయమని ఆయన వివరించారు.
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలన్నదే తన ఆకాంక్షని ముఖ్యమంత్రి వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తాను ఏనాడూ పైరవీలు చేయలేదని, కేవలం పనితీరు ఆధారంగానే జెడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి వరకు ఎదిగానని గుర్తుచేస్తూ.. పార్టీ కోసం శ్రమించే వారికి భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ ఛైర్మన్లుగా మరిన్ని అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.








