UPDATES  

NEWS

 ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన: పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం

జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన బాధిత మహిళ తాజాగా మరో వీడియోను విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బయటకు వచ్చి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుని నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యే స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకుంటుంటే, మోసపోయిన తాను మాత్రం న్యాయం కోసం పిచ్చిదానిలా తిరుగుతున్నానని ఆమె వాపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినా, దాని విచారణలో ఎలాంటి పురోగతి లేదని బాధితురాలు ఆరోపించారు. కమిటీ వేసి నెల రోజులు దాటినా ఇప్పటికీ నివేదిక ఇవ్వకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆమె నిలదీశారు. ఒక సామాన్య మహిళకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్నా, వ్యవస్థలు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇది తన వ్యక్తిగత విషయమని గతంలో చెప్పినప్పటికీ, జనసేన పార్టీ వల్లే అతనికి గుర్తింపు వచ్చిందని, కాబట్టి పార్టీ కూడా బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

తాను నమ్మి మోసపోయానని, హనీట్రాప్ లేదా రాజకీయ కుట్రలంటూ తనపై చేస్తున్న ఆరోపణలు తనను మరింత కృంగదీస్తున్నాయని బాధిత మహిళ కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన ధైర్యంతో తాను గుడ్డిగా నమ్మానని, కానీ ఇప్పుడు ఒంటరిని అయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ న్యాయం చేయకపోతే ప్రతిపక్షాల సాయం కోరడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ప్రోత్సహించవద్దని పవన్ కళ్యాణ్‌ను కోరుతూ, తన సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఆమె వేడుకున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |