UPDATES  

NEWS

 ప్రేమకు నిలువుటద్దం: భార్య ఆరోగ్యం కోసం యాచకుడిగా మారిన న్యాయవాది

సినిమా కష్టాలు నిజ జీవితంలోనూ ఎదురైతే ఎలా ఉంటుందో కాసర్ల జలంధర్ రెడ్డి కథ చూస్తే అర్థమవుతుంది. విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి కోసం కొడుకు భిక్షాటన చేస్తే, ఇక్కడ భార్య ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ భర్త తన వృత్తిని, గౌరవాన్ని పక్కనపెట్టి యాచకుడిగా మారారు. కరీంనగర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జలంధర్ రెడ్డి, తన భార్య శిరీష తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో ఆమెను కాపాడుకునేందుకు తన వద్ద ఉన్న సంపాదన అంతా ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో, చివరకు వేములవాడ రాజన్నపై భారం వేసి భార్యతో కలిసి ఆలయ సన్నిధిలో భిక్షాటన చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జలంధర్ రెడ్డికి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శిరీషతో 2006లో వివాహమైంది. పిల్లలు లేని ఆ దంపతులు అద్దె ఇంట్లో ఉంటూ సంతోషంగా జీవించేవారు. అయితే శిరీష అనారోగ్యం వారి జీవితాలను అతలాకుతలం చేసింది. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా నయం కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. ఈ క్రమంలోనే దేవుడి సన్నిధిలో భిక్షాటన చేస్తే తన భార్య ఆరోగ్యం కుదుటపడుతుందనే బలమైన నమ్మకంతో, జలంధర్ రెడ్డి తన న్యాయవాద వృత్తిని వదిలేసి వేములవాడ ఆలయ ప్రాంగణంలోనే యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు.

చిన్నపాటి మనస్పర్థలకే విడాకులు తీసుకునే నేటి కాలంలో, ప్రాణంగా ప్రేమించిన భార్య కోసం అన్నీ వదులుకున్న ఈ భర్త కథ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ప్రస్తుతం ఈ దంపతులు ఆలయ సమీపంలోనే ఉంటూ భక్తులు ఇచ్చే సహాయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. వీరి ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని చూసి స్థానికులు విస్మయానికి గురవుతున్నారు. న్యాయవాది నుంచి యాచకుడి వరకు సాగిన జలంధర్ రెడ్డి ప్రస్థానం, కష్టకాలంలో తోడుండే నికార్సైన బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |