టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత తొలిసారిగా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యారు. నిన్న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన మరుసటి రోజే ఈ నూతన వధూవరులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ లుక్‌లో రాజసంగా కనిపించారు. తమ అభిమాన జంటను చూసేందుకు ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ, అందరికీ అభివాదం చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు.
అభిమానుల కేరింతల మధ్య ఈ కొత్త జంట ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “విరోష్” పెళ్లి వేడుకల ఫోటోల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, ఈ వీడియో చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.








