ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత విపక్ష వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకూ రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీకి ఇవాళ ఇద్దరు ఎంపీలు షాకిచ్చారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణతో పాటు బీద మస్తాన్ రావు కూడా రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. వీటిపై ధన్ కర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. వీరిద్దరూ త్వరలో టీడీపీ తీర్దం పుచ్చుకోనున్నారు. రాజీనామాలు చేసిన అనంతరం వీరు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజీనామా సమర్పించాక మీడియాతో మాట్లాడిన బీద మస్తాన్ రావు తనకు మరో నాలుగేళ్లు పదవీకాలం ఉందని, మోపిదేవికి మరో రెండేళ్లు పదవీకాలం ఉందని, అయినా స్వచ్చందంగా రాజీనామాలు సమర్పించినట్లు వెల్లడించారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్చందంగానే తమ పదవులు వదులుకున్నట్లు తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
రాజీనామా చేసిన మరో ఎంపీ మోపిదేవి వెంకట రమణ కూడా స్పందించారు. పార్టీలో ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఐదేళ్ల నుంచి రాజకీయంగా గౌరవంగా తలెత్తుకునే విధంగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు అన్నారు. పరువు ప్రతిష్టల గురించి కొందరు మాట్లాడుతున్నారని, 40 ఏళ్ల నుంచి గౌరవప్రదంగా రాజకీయం చేస్తున్నానని మోపిదేవి తెలిపారు. ప్రజల మధ్య ఉంటున్నానని గుర్తుచేశారు.