వినియోగదారులకు బిగ్ షాక్. చమురు సంస్థలు గ్యాస్ ధరలు మళ్లీ పెంచాయి. సెప్టెంబర్ ఒకటో తేది వచ్చిన నేపథ్యంలో చమురు సంస్థలు గ్యాస్ ధరలపై అప్డేట్ ప్రకటించాయి.
19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో సామాన్యులకు కొంత ఊరట లభించింది.
పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రేట్ల ప్రకారం..నేటి నుంచి కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 39 పెరిగింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1691.50కు చేరింది.
ఇండియన్ ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల పెంపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1644కు చేరింది. అయితే ఈ ధరలు పెంపుదలకు ముందు గతంలో ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1605గా ఉంది.
హైదరాబాద్ విషయానికొస్తే.. గతంలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1817 గా ఉంది. ప్రస్తుతం ధరల పెంపుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1935గా ఉంది. ఇక, కోల్‌కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.1764.50 ఉండగా..ప్రస్తుతం రూ.1802.50కి పెరిగింది. చెన్నైలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1855కు చేరింది.
గత కొంతకాలంగా ఆయిల్ కంపెనీలు డిమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.803 ఉంది. ఇదే గ్యాస్ సిలిండర్ ఉజ్వల లబ్ధిదారులకు రూ.603కే లభిస్తుంది. ఇక, ముంబైలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50 ఉండగా.. హైదరాబాద్‌లో రూ.855, విశాఖపట్నంలో రూ.812, చెన్నైలో రూ.818.50గా ఉంది.
ఇదిలా ఉండగా, అంతకుముందు ఆగస్టులో కూడ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.8.50 పెరిగింది. కాగా, జూలైలో మాత్రం ధరలు తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 30 తగ్గింది.