UPDATES  

NEWS

 ఇరాన్‌పై యుద్ధం నిలిపివేయాలన్న రష్యా, చైనా… వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న అమెరికా..

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యా, చైనా చేసిన విజ్ఞప్తులను అమెరికా తోసిపుచ్చింది. ఈ ఘర్షణ పూర్తిగా టెహ్రాన్ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని, ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారం నాడు పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాట్లాడారు. ఈ విషయంలో బీజింగ్ లేదా మాస్కోతో తాము చర్చించడం లేదని, ప్రస్తుత ఘర్షణలో వారి ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. “వారికి నేనిచ్చే సందేశం ఏమీ లేదు.. ఈ విషయంలో వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు” అని హెగ్సెత్ వ్యాఖ్యానించారు.

 

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా సైన్యం చేపట్టిన దాడులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ ఆస్తులు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డాన్ కెయిన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి ప్రయోగాలు 86 శాతం తగ్గాయని వివరించారు.

 

అణు కార్యక్రమంపై ఇరాన్ నిజాయతీగా చర్చలు జరపడం లేదని తమ నిఘా వర్గాలు నిర్ధారించుకున్న తర్వాతే ఈ సైనిక చర్య ప్రారంభించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇరాన్ వద్ద తమపైకి ఎక్కుపెట్టిన వేలాది క్షిపణులు ఉన్నాయని హెగ్సెత్ ఆరోపించారు. ఈ ఆపరేషన్ లక్ష్యం ఇరాన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమేనని అమెరికా స్పష్టం చేసింది.

 

ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులనుంచి రక్షణ కోసం సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి మధ్యప్రాచ్య దేశాలు సహాయం అందిస్తున్నాయని పెంటగాన్ వెల్లడించింది. అయితే, ఈ యుద్ధంలో ప్రాథమికంగా పైచేయి సాధించినప్పటికీ, ఇది ఇంకా తొలిదశలోనే ఉందని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు. “మనం 100 గంటల యుద్ధంలో ఉన్నాం. ఇది ఇంకా చాలా ప్రాథమిక దశ” అని జనరల్ కెయిన్ పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |