హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇటీవల సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసింది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు.
హైదరాబాద్‌లోని అమర్ కో ఆఫరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉంటున్నారు. ఈ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు సైతం హైడ్రా నోటీసులు అందజేసింది. నెలల్లోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో తాను ఇల్లు కొనుగోలు చేశానని, అది ఎఫ్‌టీఎల్ పరిధిలో వస్తుందని తనకు తెలియదన్నారు. ఒకవేళ తాను నివాసం ఉంటున్న ఇల్లు.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని వెల్లడించారు.
దుర్గంచెరువు పరిధిలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులతోపాటు సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు కూడా ఉండటం గమనార్హం. కాగా, ఇప్పటికే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.
మొదట చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేసిన తర్వాత బఫర్ జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా వెల్లడించింది. దీంతో ఇప్పుడు హైడ్రా తదుపరి టార్గెట్ ఎవరని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి ఆక్రమణలు నిర్మించుకున్న ప్రముఖుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా, దుర్గం చెరువు పరిధిలోని ఇంటి నివాసాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించడంతో నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్‌లోని తిరుపతి రెడ్డి ఇంటి నివాసం వద్ద మీడియా సిబ్బందిని వెళ్లనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంది.