బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం వాయిగుండంగా మారింది. దీంతో రెండు రోజుల నుంచి వానలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముసురు అలుముకోగా..మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక, హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త రానున్న 36 గంటల్లో వాయిగుండంగా మారనుంది. దీంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సీఎం మాట్లాడారు. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.
ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 నిమిషాల మధ్య తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.