ఏపీలో భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం నమోదైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహస్తున్నాయి. నదుల్లో వరద నీరు చేరుతోంది. సముద్రంలోకి నీరు వదులుతున్నారు. దీంతో, ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సహాయక శిబిరాలు ఏర్పాటు చేసారు. వర్షాల పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు.
కంట్రోల్ రూం
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మంగళగిరిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ శాఖలు, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్లను పర్యవేక్షిస్తుంది. 4 జోన్ల లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. ఆర్టీజీఎస్ లో ప్రభుత్వం మరో బృందాన్ని ఏర్పాటు చేసింది.
కీలక ఆదేశాలు
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదు. నష్టం తగ్గించేలా అధికారులు పనితీరు ఉండాలన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం సాయం చేయడం కాదని చెప్పారు. ప్రమాదం జరగకుండా చూడటం పై యంత్రాంగం దృష్టి పెట్టాలని అని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
బాధితులకు అండగా
వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం వెంబటి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసె లను ఇప్పుడూ పాటించాలన్నారు. తుఫాన్ కళింగపట్నం ప్రాంతంలో తీరం దాటిందని, ఆదివారం వర్షాల తీవ్రత తగ్గుతుందని అధికారులు చెప్పారు. విజయవాడలో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో చంద్రబాబు సోమవారం పర్యటించనున్నట్లు సమాచారం.