ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్.. దేశంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర బిందువు కానుంది. ఆర్థిక పటిష్టతకు బలమైన పునాది వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు రాష్ట్రాలు, ఇటు ప్రజలకు.. దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించేలా, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించేలా కేంద్రం యూపీఎస్‌ను రూపొందించింది.
ఈ పథకం వెనుక ఉన్న హేతుబద్ధత, పాత పెన్షన్ విధానానికి యూపీఎస్‌కు ఉన్న తేడాల గురించి పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న పాత పెన్షన్ స్కీమ్ కంటే ఎంతో భిన్నం. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా సంకట పరిస్థితులు ఎదుర్కొనేలా చేసిన ఓపీఎస్ కంటే పెన్షన్‌దారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందీ యూపీఎస్.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఓపీఎస్.. ఒకరకంగా ఆర్థిక దివాళా తీయడానికి దారి తీసింది. ఓపీఎస్ వల్ల రాష్ట్రాలు తమ హామీలను నెరవేర్చడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఓపీఎస్‌ను అమలు చేయడానికి తగిన ఆర్థిక కేటాయింపులు చేయలేక పోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అపారమైన భారం పడింది.
ఆర్ఎస్ ప్రవీణ్
ఓపీఎస్ విధానం- క్రమంగా 1980, 1990, 2000వ దశకం ప్రారంభంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుకు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు జీతాలు చెల్లించడం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం, మౌలిక సదుపాయాల రంగాలకు తగినన్ని నిధులను కేటాయించలేని దుస్థితుల్లో నెట్టింది.
దీనికి భిన్నంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. బలమైన ఆర్థిక సూత్రాల ఆధారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కు జీవం పోసింది. రాష్ట్రాలపై అటు ఆర్థిక భారం పడకుండా.. ఇటు పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమతౌల్యాన్ని సాధించేలా రూపకల్పన చేసింది కేంద్రం.
ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా పెన్షన్లను మంజూరు చేసేలా యూపీఎస్‌ను రూపొందించింది. ఓపీఎస్‌లో ఉన్ ఓపెన్-ఎండ్ ఫైనాన్షియల్ కమిట్‌మెంట్‌ను నివారించగలుగుతుంది. ఫలితంగా రాష్ట్రంపై అధిక రుణభారం పడకుండా నిరోధించగలుగుతుంది.
సాంఘిక సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ఇతర కీలకమైన రంగాలకు కేటాయింపుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాబోవు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌పై విమర్శలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని యు-టర్న్ స్కీమ్‌గా ఆరోపణలు గుప్పిస్తోంది. పెన్షన్ సంస్కరణలను వెనక్కి తీసుకుందంటూ మండిపడుతోంది.
ఈ వాదనలు, విమర్శలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను ఉపసంహరించుకోవడమో లేదా ఓపీఎస్ విధానంలోకి మళ్లీ అడుగు పెట్టడం వంటిదో కాదని స్పష్టంచేశారు. వాటికి భిన్నంగా యూపీఎస్ ఉద్యోగుల అవసరాలను తీర్చేలా రూపొందించామని తేల్చి చెప్పారు.
అటు ఓపీఎస్.. ఇటు ఎన్‌పీఎస్‌లల్లోని లోపాలను పరిష్కరించేలా యూపీఎస్‌కు కేంద్రం తుదిరూపం ఇచ్చింది. ఉద్యోగుల ప్రయోజనాల, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు సమతుల్యం చేసేలా రూపుదిద్దింది. అందుకే దీనికి కొత్త పేరు పెట్టింది. ఈ స్కీమ్ పాత విధానాలను అనుసరిస్తూ కొత్త పేరు పెట్టడం మాత్రమే కాకుండా నిజమైన ఆర్థిక విధానాలకు బీజం వేసినట్టయింది.
పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసాను అందించడంతో పాటు ప్రభుత్వాలపై భారం పడకుండా ఉండకూడదనేది దీని ముఖ్య ఉద్దేశం. రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ పథకం కింద సహేతుక పెన్షన్ మొత్తం లభిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదు.
ఈ విధానం- మోదీ ప్రభుత్వ విస్తృత ఆర్థిక వ్యూహానికి అద్దం పట్టింది. ఆర్థిక సమతుల్యం, స్థిరత్వాన్ని ప్రాతిపదికగా తీసుకుని యూపీఎస్‌ను రూపొందించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా యూపీఎస్ ఓ మంత్రంలా పని చేస్తుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించడంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని, అదే సమయంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక చేయూతను అందించడాన్ని మోదీ ప్రభుత్వం తన ప్రధాన బాధ్యతగా భావించింది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేలా కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. ఇది- ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
బ్యాంకుల్లో అకౌంట్ లేని వారి కోసం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలను మోదీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేదలకు గూడు కల్పించడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, కోట్లాదిమంది ప్రజలకు ఆరోగ్య బీమా కోసం ఆయుష్మాన్ భారత్.. ఇవన్నీ కూడా మోదీ ప్రభుత్వంలో అమలువుతున్నాయి.