తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. బెలగావిలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి కూడా బెలగావికి వెళ్లనున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెలగావికి చేరుకుంటారు. ఈ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి వీరు బయల్దేరుతారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమవుతాయి.
మహాత్మాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయ్యాయి. బెలగావిలోనే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ‘నవ సత్యాగ్రహ బైఠక్’ అని నామకరణం చేసింది.
ఈ సమావేశాలకు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, పీసీసీ చీఫ్ లు, సీఎల్పీ నేతలు సహా దాదాపు 200 మంది కీలక నేతలు హాజరుకానున్నారు.