పాప్ కార్న్ పై జీఎస్టీ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. పాప్ కార్న్ పై వాటి ఫ్లేవర్లు, అందులో కలిపే పదార్ధాల ఆధారంగా మూడు విభిన్న జీఎస్టీ స్లాబ్ లుకా విభజించి పన్ను వేయడంపై విపక్షాలు, ఆర్ధిక వేత్తలతో పాటు కేంద్రంలోని అధికార పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్దించుకుంటున్నారు.
చక్కెర లేదా మసాలా కంటెంట్ ఆధారంగా పాప్‌కార్న్‌పై మూడు జీఎస్టీ స్లాబ్ లలో పన్ను విధించాలన్న కేంద్రం నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఇంకా చెప్పాలంటే అసలు జీఎస్టీ విధానం అమలు తీరుపైనే విమర్శలకు కారణమవుతోంది.
తాజా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఉప్పు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన నాన్-బ్రాండెడ్ పాప్‌కార్న్‌కు 5 శాతం జీఎస్టీ విధించాలని, ప్యాక్ చేసిన, బ్రాండెడ్ పాప్‌కార్న్ 12 శాతం, కారామెల్ పాప్‌కార్న్, ఇతర స్వీట్ పాప్ కార్న్ కు 18 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. దీంతో ఒక్క పాప్ కార్న్ కు మూడు స్లాబ్ లు ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పాప్ కార్న్ పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీలో వాటిని రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా 5, 12, 18 శాతం పన్ను స్లాబ్ లుగా విభజించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వచ్చేసింది. అయితే పాప్ కార్న్ పై 18 శాతం పన్ను విధించడం ఏంటన్న ప్రశ్నకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.. చక్కెర కలిసిన ఉత్పత్తి ఏదైనా ఎక్కువ పన్ను ఉంటుందని వివరణ ఇచ్చారు.
కేంద్రం నిర్ణయంపై సోషల్ మీడియాలో సైతం జోక్స్, మీమ్స్ పేలుతున్నాయి. మాజీ ఆర్ధిక సలహాదారులు కేవీ సుబ్రమణియన్ , అరవింద్ సుబ్రమణియన్, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఇలా పలువురు కేంద్రం పాప్ కార్న్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్వీట్లు పెడుతున్నారు. జీఎస్టీ సంక్లిష్టత పేరుతో సమస్యను పెంచుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.