ఏపీకి భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం జరిగింది. రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా రూ.95,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 6100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం ఆమోద ముద్ర వేసింది. కొద్ది రోజులుగా ఈ పెట్టుబడి పైన చర్చ సాగుతుండగా.. ఇప్పుడు ఈ నిర్ణయం అమలు దిశగా నిర్ణయం జరిగింది.
ఏపీలో గేమ్ ఛేంజర్
ఏపీలో మరో భారీ పెట్టుబడికి లైన్ క్లియర్ అయింది. తొలుత మచిలీపట్నం లో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం బీపీసీఎల్ తో చర్చలు జరిగాయి. అయితే, బీపీసీఎల్ సంస్థ రామాయపట్నం వైపు మొగ్గు చూపింది. రాష్ట్రానికి ప్రాజెక్టు రావటం కోసం ఏపీ ప్రభుత్వం అందుకు సమ్మతించింది. దీంతో, రామాయపట్నంలో బీపీసీఎల్ దశల వారీగా ప్రాజెక్టు విస్తరణ దిశగా కార్యాచరణ సిద్దం చేసింది. తాజాగా బీపీసీఎల్ రూ.6100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి రాసిన లేఖలో సంస్థ పేర్కొంది.
అధికారిక నిర్ణయం
సెబీ రెగ్యులేషన్స్- 2015లోని 30వ నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిపామని బీపీసీఎల్ తెలిపింది. ఇందులో పలు అంశాలపై ప్రాథమిక అధ్యయనాలు, భూసేకరణ, డీపీఆర్ తయారీ, పర్యావరణ ప్రభావ మదింపు, ప్రాథమిక డిజైన్ ఇంజినీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ తదితరాలు ఉంటాయని పేర్కొంది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌ఎస్‌ఈని కోరింది. ఈ ప్రాజెక్టు దక్కించుకునే వేళ ఏపీ కి గుజరాత్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.
రామాయపట్నం ఎంపిక
ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఏపీలో ముందుగా మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను పలు దఫాలు పరిశీలించింది. అవసరమైన భూముల తో పాటుగా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రామాయపట్నాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం క్యాప్టివ్ విధానంలో బెర్త్‌ను కేటాయించే ప్రతిపాదన ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రాజెక్టు కోసం సుమారు 5000ల ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదించింది. ఆ మేరకు భూసేకరణకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన రూ.6100 కోట్లలో భూసేకరణ ఖర్చుపోను మిగిలిన రూ.4600 కోట్లను ఇతర అవసరాల కోసం వెచ్చిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు లక్ష మందికి, పూర్తైన తర్వాత 5000ల మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉంది.