స్టార్ హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు మరో షాకిచ్చారు. రేపు (మంగళవారం) విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన నటించిన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరుఫు న్యాయవాదులు హైకోర్టు తలుపులు తట్టారు. ఎట్టకేలకు హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్‌ను విడుదల చేయడం జరిగింది.
థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్‌తో పాటు, ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విచారణకు అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.