UPDATES  

NEWS

 ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ.. రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పంట పండినట్టేనా..?

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం వెనుక ఏం జరిగింది? రాష్ట్రానికి కావాల్సిన నిధులతోపాటు తాజా రాజకీయాలపై చర్చించారా? రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పంట పండినట్టేనా? సీఎం చంద్రబాబు ప్రస్తావించిన సమస్యలపై కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అవుననే అంటున్నారు పార్టీల నేతలు.

 

హస్తినలో బుధవారం రోజంతా బిజీగా గడిపారు సీఎం చంద్రబాబు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే ముఖ్యనేతల భేటీ జరిగింది. దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరై వివిధ అంశాలపై మిత్రులతో చర్చించారు.

 

ముఖ్యంగా జమిలి ఎన్నికల గురించి కొందరు ఆరా తీశారు. ఈ అంశంపై తొలి అడుగు పడిందని, జేపీసీ వేశామని ఇచ్చిన నివేదిక తర్వాత చర్చిద్దామని అన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలపై నేతలంతా చర్చించినట్టు ఢిల్లీ సమాచారం.

 

ఎన్డీయే నేతల సమావేశం తర్వాత ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయా మంత్రులతో చర్చించి సహకారం అందించాలని కోరారు. మంత్రుల నుంచి సానుకూలంగా సంకేతాలు వచ్చాయన్నది టీడీపీ నేతల మాట.

 

అనంతరం ప్రధాని నరేంద్ర‌మోదీ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. దాదాపు గంటపాటు ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు. తొలుత పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానికి నిధులు సమకూర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రధానికి వివరించారు.

 

విజన్-2047 డాక్యుమెంట్‌ కాపీని ప్రధానికి అందజేశారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం 94 కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించిందని విషయాన్ని వివరించారు. వాటిలో 74 పథకాలను పునఃప్రారంభించినట్టు తెలిపారు. ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పే విషయం గురించి ప్రధానితో చర్చించారు సీఎం. ఈ ప్లాంట్‌కు అనుమతులతోపాటు ముడిసరకు కేటాయింపులపై చర్చ జరిగింది.

 

రానున్న రోజుల్లో కొన్ని ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయాన్ని ప్రస్తావించారు. దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఇరువు మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్‌కు పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించి వివరాలను ప్రధాని ముందు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి రానున్న కేంద్ర బడ్జెట్‌తో నిధుల విషయం ఏపీ పంట పండడం ఖాయమని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |