రేవతి మరణించిన విషయం తనకు తెలియదని, ఎవరూ చెప్పలేదంటూ నిన్న పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనైనట్లుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు విచారించారు. వివిధ అంశాలపై ప్రశ్నించిన పోలీసులు… ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు.
థియేటర్ వద్ద తొక్కిసలాటకు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిమాణాలపై పోలీసులు ఆయనను 20 ప్రశ్నలు అడిగారు.
పుష్ప-2 సినిమా సందర్భంగా సినీ నటుల ర్యాలీకి అనుమతి లేదనే విషయం తెలియదా? అని పోలీసులు ప్రశ్నించగా.. థియేటర్ యాజమాన్యం తనకు చెప్పలేదని అల్లు అర్జున్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
40-50 మంది బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టుకుంటూ లోనికి వెళ్లారని, ఇదే ప్రమాదానికి కారణమని చెబుతూ పోలీసులు ఓ వీడియోను చూపించారు. బౌన్సర్లకు సంబంధించి సమాచారం ఇవ్వాలని అల్లు అర్జున్‌కు సూచించారు.
తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి, బాలుడికి గాయాలపై అల్లు అర్జున్‌కు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారనే విషయమై నాలుగు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే రేవతి మృతి విషయం తనకు తెలియదంటూ అల్లు అర్జున్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. ప్రీమియర్ షోకు తాము రావడానికి అనుమతి రాలేదనే విషయం తనకు తెలియదన్నారు.
విచారణ సమయంలో మధ్యాహ్నం ఒకసారి పోలీసులు టీ తెప్పిస్తే అల్లు అర్జున్ తాగారు. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ విచారణకు హాజరయ్యారు. అవసరమైతే మరోసారి విచారణ కోసం రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పగా… విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కాగా, సంధ్య థియేటర్ ఘటన తొక్కిసలాటకు ప్రధాన కారణం బౌన్సర్లు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న బౌన్సర్లు ఎవరూ ఆయన వెంట రాలేదు.