రాజమండ్రిలో కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పాల వ్యాపారి సరఫరా చేసిన పాలల్లో ‘ఇథైలిన్ గ్లైకాల్’ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం కలిసినట్లు అధికారులు శనివారం ధృవీకరించారు. ఈ రసాయనం శరీరంలోకి చేరడం వల్ల బాధితులకు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని (అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్), తద్వారా ఇప్పటివరకు పది మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక స్పష్టం చేసింది.
ఈ దారుణానికి గల కారణాలను విశ్లేషిస్తే, నిందితుడు గణేష్ ‘వరలక్ష్మి డైరీ’ పేరుతో నిర్వహించే పాల కేంద్రంలోని ఫ్రీజర్ లీక్ అవ్వడమే ప్రధాన కారణంగా తేలింది. ఫ్రీజర్ లీకేజీని అరికట్టేందుకు అతను ‘ఎంసీల్’ ఉపయోగించినప్పటికీ, లోపలి రసాయనాలు పాలల్లో కలిసి విషపూరితంగా మారాయి. పాలు చేదుగా ఉన్నాయని ఖాతాదారులు ఫిర్యాదు చేసినప్పటికీ, వ్యాపారి ఏమాత్రం పట్టించుకోకుండా అవే పాలను సరఫరా చేయడంతో ఇంతటి ప్రాణనష్టం సంభవించింది.
ప్రస్తుతం ఈ ఘటనలో పాల వ్యాపారి గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరణించిన పది మంది కాకుండా, మరో పది మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక పరిహారం ప్రకటించగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.







