తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు-2025’లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో ఆమె కనబరిచిన అద్భుత నటనకు గాను ఈ గౌరవం దక్కింది. శనివారం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ దిల్ రాజు ఈ అవార్డుల విజేతలను అధికారికంగా ప్రకటించారు. రష్మికతో పాటు ‘తండేల్’ చిత్రానికి గాను అక్కినేని నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
ఈ అవార్డు రావడం పట్ల రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. “గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది, నిజంగా కృతజ్ఞురాలిని. ఈ సినిమాలో నేను పోషించిన ‘భూమా దేవి’ పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది” అని ఆమె పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్, గీతా ఆర్ట్స్ సంస్థకు ధన్యవాదాలు తెలపడంతో పాటు, ఈ గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు, ఈ ఏడాది అవార్డుల్లో ‘తండేల్’ చిత్రం జాతీయ సమైక్యత విభాగంలోనూ అవార్డును గెలుచుకోగా, అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కథాంశం విషయానికి వస్తే.. కాలేజీలో ప్రేమలో పడిన ఒక అమ్మాయి స్వేచ్ఛను, ఆమె ప్రియుడు ఎలా నియంత్రించాలని ప్రయత్నిస్తాడనే సున్నితమైన అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రష్మిక నటన విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.








