తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ‘విజయ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం సికింద్రాబాద్‌లోని విజయ డైరీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ వ్యక్తులపై మండిపడ్డారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయ బ్రాండ్‌ను ప్రైవేట్ ఫ్రాంచైజీలకు ఇవ్వడం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మేఘన ఫుడ్స్ అనే సంస్థకు ఫ్రాంచైజీ ఇవ్వగా, వారు గుజరాత్‌లో నెయ్యి తయారు చేసి తెలంగాణ మార్కెట్లో విక్రయిస్తున్నారని అమిత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నివేదికలో తేలిందని, నెలకు సుమారు 100 టన్నుల కల్తీ నెయ్యి హైదరాబాద్‌లో అమ్ముడవుతోందని ఆరోపించారు. విజయ డైరీకి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యక్తులు నాణ్యత లేని ఉత్పత్తులను ప్రజలకు అంటగడుతున్నారని, దీనిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
డైరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోకూడదని, ఈ విషయమై ఏపీ డైరీ అధికారులకు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అమిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలోనూ ఈ కల్తీ ఉత్పత్తుల వ్యవహారంపై చర్చ జరుగుతోందని, అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ ఫ్రాంచైజీల అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పాడి రైతుల ఆదాయానికి గండికొడుతున్న ఇటువంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.







