ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. నేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు కవితను సీబీఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ నెల 11న కవితను అరెస్ట్ చేసి.. 12న కస్టడీకి తీసుకున్న సీబీఐ అధికారులు ఆమెను విచారించారు. నేటితో గడువు ముగియడంతో.. కోర్టు ముందు హాజరు పరిచి ఆమె వెల్లడించిన వివరాలను న్యాయమూర్తి ముందు ఉంచనుంది సీబీఐ.
మూడురోజుల విచారణలో కవిత సహకరించలేదని సీబీఐ భావిస్తే.. మరో 3-5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశాలున్నాయి. ఆదివారం సీబీఐ అధికారులు కవితను గంటసేపు విచారించినట్లు తెలుస్తోంది. ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ముందు ఉంచి.. ఆర్థిక లావాదేవీలపై విచారించారు సీబీఐ అధికారులు. అయితే తాను ఎవరి నుంచీ డబ్బు తీసుకోలేదని, వాటి గురించి తనకేమీ తెలియదని కవిత సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. శరత్ చంద్రారెడ్డితో జరిగిన బ్యాంక్ లావాదేవీల గురించి ప్రశ్నించగా.. అది తన పర్సనల్ అని, బ్యాంక్ లావాదేవీలు జరగడం చాలా కామన్ అని, దాని గురించి ఎలా ప్రశ్నిస్తారని ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అయితే తమ వద్ద కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్ లు ఉన్నాయని, తప్పించుకోలేరని సీబీఐ కవితను నిలదీసినట్లు తెలుస్తోంది.
సీబీఐ విచారణ తర్వాత.. ములాఖత్ లో సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావులు కవితను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన లాయర్.. ఈ కేసులో ఈడీ, సీబీఐ నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న కవిత.. త్వరలోనే బయటకు వస్తారని తెలిపారు.
మరోవైపు ఏప్రిల్ 23వ తేదీతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఏప్రిల్ 8న కవితకు కోర్టు మధ్యంతర బెయిల్ తిరస్కరించింది. అటు సాధారణ బెయిల్ పిటిషన్‌పై రేపు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.
ఇదే కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భవితవ్యం నేడు తేలనుంది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ ను సమర్థిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు తొలిసారి విచారణ జరగనుంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుండగా.. కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచనున్నారు.