ముఖ్యమంత్రి జగన్ భద్రత పై పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. విజయవాడలో జగన్ పైన జరిగిన దాడి ఘటనతో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి పైనే దాడి చేయటంతో జాతీయ స్థాయిలో చర్చగా మారింది. ఎన్నికల సంఘం ఈ ఘటన పైన నివేదిక కోరింది. వీఐపీల భద్రతలో వైఫల్యం పైన పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రాధమిక సమాచారంతో ఈసీకి పోలీసు అధికారులు నివేదిక అందించారు.
జగన్ పైన విజయవాడలో జరిగిన దాడితో పోలీసు శాఖ అలర్ట్ అయింది. దాడి ఘటన పైన విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. విచారణ జరుగుతుందని చెప్పిన అధికారులు…20 మందితో ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ సమీపంలోని స్కూలు పైన నుంచి ఈ దాడికి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్దారణకు వచ్చారు. చంద్రబాబు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏకంగా ముఖ్యమంత్రి పైన దాడి జరగటం ఏంటని ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనికి సంబంధించి నివేదిక అందిన తరువాత అధికారుల పైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇక నుంచి జగన్ పాల్గొనే ఎన్నికల ప్రచార సభలు..రోడ్ షోల పైన తాజాగా పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ముఖ్యులకు సూచనలు చేసారు.
బస్సు యాత్ర చేసే సమయంలో వంద మీటర్ల వరకు దూరం పాటించాలని సూచించారు. యాత్ర సమయంలో గజమాలలు, క్రేన్ ల ద్వారా అభినందనలు మినహాయించాలని పేర్కొన్నారు. బస్సు నుంచి ప్రచారం చేసే సమయంలో ఖచ్చితంగా బారికేడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదే విధంగా సభల సమయంలో ప్రజల మధ్యకు వెళ్తున్నారని..ఆ సమయంలో జాగ్రత్తలు అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు.