ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ముఖ్య రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెనాలిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాసి విసిరాడు. అయితే, అది పక్కన పడింది.
తాజాగా, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపైనా రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపైకి రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే, చంద్రబాబుకు తగలకుండా పక్కకుపడింది. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి అక్కడ్నుంచి పరారు కావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వరుస రాళ్ల దాడుల ఘటనలు జరుగుతుండటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న చీకట్లో సీఎం జగన్‌పై గులకరాయి పడింది. ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే నాపై రాయి విసిరారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఈ పనిచేస్తోంది అని చంద్రబాబు ఆరోపించారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారు. విజయవాడలో నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా. గత ఎన్నికలప్పుడు కూడా నాపై రాళ్లు వేశారు. క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదు.. ఈ రాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నిన్న జగన్ సభలో కరెంట్ పోయింది. ఎవరు బాధ్యత వహించాలి. కరెంట్ బంద్ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జగన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు. దాడులు చేస్తే.. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయి హత్యను నా మీద నెట్టాలని ప్రయత్నించారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మోరిగాయి. రాళ్లు నేనే వేయించినట్లు మాట్లాడారు అని చంద్రబాబు మండిపడ్డారు. కాగా, ఏపీలో వరుసగా జరుగుతున్న రాళ్ల దాడులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.