UPDATES  

NEWS

 ఢిల్లీలో ధర్నాకి జగన్ కు సపోర్ట్ గా ఆ పార్టీ నేతలు..?

వై నాట్ వన్ సెవంటీ ఫైవ్ అంటూ మాజీ సీఎం జగన్ భారీగానే దెబ్బతిన్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి ఏపీ ఓటర్లు బ్రేకులు వేశారు. కనీసం ప్రతిపక్షహోదా కూడా లేకుండా చేశారు. పార్టీ శ్రేణులు నిరాశా నిస్సృహతో ఉన్నారు. జగన్ పని అయిపోయింది. ఇక ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని కొందరు తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకేు రాష్ట్రంలో ఏ పరిస్థితినీ అంత తేలిగ్గా వదులుకోదల్చుకోలేదు జగన్. మొన్నటి రషీద్ హత్యోదంతాన్ని జాతీయ స్థాయికి తీసుకెళదామని అనుకున్నారు జగన్. ఆ మేరకు రాష్ట్రపతికి సైతం లేఖలు రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తమ కార్యకర్తలపై దాడులు జరుపుతున్నారని, హత్యలకు సైతం వెనకాడటం లేదని, టీడీపీ కార్యకర్తలు గుండాలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు లేఖలు రాశారు. అదీ చాలదన్నట్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి ఏపీలో శాంతి భద్రతల సమస్యను జాతీయ సమస్యగా చూపిద్దామని అనుకున్నారు జగన్.

 

ఇండియా కూటమి మద్దతు

 

జగన్ అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. రాష్ట్రంలో టీడీపీతో కలిసి పోటీచేసిన బీజేపీ ఇప్పుడు జగన్ కు ఏ రకంగా మద్దతు ఇస్తుంది. అదే జరిగింది. బీజేపీ నేతలు ఎవరూ కనీసం జగన్ ను పరామర్శించడానికి సైతం వెళ్లలేదు. అయితే మోదీకి వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమి కి చెందిన ముఖ్య నేతలు మాత్రం జగన్ కు బాగానే మద్దతు ఇచ్చారు. ఎన్నికల ముందు జగన్ కూడా మోదీకే సపోర్టు అనే అనుమానంతో మైనారిటీ ముస్లిం ఓటర్లు జగన్ కు దూరం అయ్యారు. అది కూడా జగన్ ఓటమికి ఓ కారణం అయింది. అయితే ఊహించని రీతిలో తనకు మద్దతునిస్తున్న ఇండియా కూటమి నేతల వైఖరితో జగన్ ఆశ్చర్యపోతున్నారు. ఈ మాత్రం సపోర్టు దొరికితే చాలు ఇక కేంద్రాన్ని ఆడుకోవచ్చని జగన్ ప్లాన్. పైగా ఈ సారి కేంద్రంలో బలమైన ప్రతిపక్షంగా తయారయింది ఇండియా కూటమి.రీసెంట్ గా, దేశవ్యాప్తంగా 13 నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో మోదీ కూటమి కేవలం రెండు స్థానాలకే పరిమితం కాగా పది స్థానాలలో ఇండియా కూటమి జయకేతనం ఎగురవేసింది. భవిష్యత్ లో మోదీకి ప్రత్యామ్నాయం తామే నని చెప్పనట్లయింది. మొన్నటిదాకా ఎటూ తేల్చుకోలేక డైలమాలో పడ్డ జగన్ ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ తో కలసి ప్రయాణం..

 

ఎలాగూ ఏపీలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీ ఒక్కటి కూడా లేదు. ఇండియా కూటమి సహాయ సహకారాలతో ఇకపై జాతీయ స్థాయిలో ఏపీ పై ఉద్యమాలు చేసేందుకు జగన్ సన్నద్ధం అవుతున్నారు. జగన్ ఢిల్లీ ధర్నాలో ఉన్నప్పుడు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అదే సమయంలో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ సైతం జగన్ కు మద్దతు తెలపడం విశేషం . పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా జగన్ కు మద్దతుగా నిలిచారు. ఇంకా శివసేన నేతలు, ఎంఐఎం నేతలు జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. ఏపీలో చంద్రబాబు వ్యూహంతో బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీచేసి అత్యధిక మెజారిటీ సాధించుకున్న రీతిలో వచ్చే ఎన్నికలలో తాను కూడా కాంగ్రెస్ కు సపోర్టు చేస్తే మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, సీనియర్ నేతలు తమ పార్టీకి మద్దతు నిస్తారని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

మొత్తానికి ఫలితం దక్కింది

 

రాజకీయాలలో ఏదైనా..ఎప్పుడైనా జరగొచ్చు. నిన్న తిట్టుకున్న నేతలే నేడు కలుసుకోవచ్చు శత్రువులు కూడా మిత్రులవ్వవచ్చు. జగన్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన నేతే కదా కాబట్టి మరో సారి కాంగ్రెస్ సపోర్టు తీసుకుంటే పార్టీకి లాభమే తప్ప నష్టం లేదని జగన్ భావిస్తున్నాడని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ ధర్నా జగన్ కు వ్రతం చెడ్డా..ఫలితం మాత్రం దక్కిందనే చెప్పాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |