UPDATES  

NEWS

 డొల్ల బడ్జెట్ అంటూ రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డ కేటీఆర్..

తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల, ఎగవేతల బడ్జెట్ అని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దని ఆయన దుయ్యబట్టారు. వాగ్దానాలను గాలికొదిలిన వంచనల బడ్జెట్, డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని విమర్శించారు.

 

విధానం లేదు, విషయం లేదు, విజన్ లేదు. పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్! అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం పెట్టారంటూ ఆయన ఆక్షేపించారు. ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్ములకు మహామోసం. అవ్వా,తాతలకు, దివ్యాంగులకు, నిరుపేదలకు, నిస్సహాయులకు మొండిచేయి చూపారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

 

పెన్షన్ల పెంపు మాటెత్తలేదు, దళితులకు దగా, గిరిజనులకు మోసం అంటూ కేటీఆర్ మండిపడ్డారు. అంబేడ్కర్ అభయహస్తం ఊసులేదు, శూన్యహస్తమే మిగిలిందని, బడుగు బలహీన వర్గాలకు భరోసాలేదని వృత్తి కులాలపై కత్తికట్టారని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలయ్యాయని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని, 4 వేల రూపాయల భృతి జాడా పత్తా లేదంటూ విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్.

 

చివరకు విద్యార్థులపై కూడా వివక్ష చూపారని, 5 లక్షల రూపాయల భరోసా కార్డు ముచ్చటే లేదని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్ అభివృద్ధిపై శ్రద్ధలేదని, మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవని తూర్పారబట్టారు. నేతన్నకు చేయూత లేదని, ఆటో అన్నలకు అండదండ లేదన్నారు. ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమే కనిపించ లేదన్నారు. మొత్తంగా పసలేని దిశలేని, దండగమారి బడ్జెట్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ ప్రాజెక్టును గురువారం సందర్శించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు బయల్దేరారు. అనంతరం కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్ఎస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ఇరిగేషన్ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామన్నారు.

 

చిన్న లోపాన్ని చూపి మొత్తం ప్రాజెక్టు విఫలం అన్నట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు కేటీఆర్. బీఆర్ఎస్ బృందం రాత్రికి రామగుండంలో బస చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్‌ను పరిశీలిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టను సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్ట పరిస్థితి, అక్కడ ప్రవాహం, పంప్ హౌస్‌ వద్ద నీటిమట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు, తదితరాల గురించి పరిశీలిస్తారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |