UPDATES  

NEWS

 ఏపీ రాజకీయాల్లోకి అనుష్కశెట్టి.. అక్కడి నుంచి పోటీ..?

స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి రాజకీయాల్లోకి వస్తుందా ? అంటే అవును అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పీక్స్ లో ఉన్నాయి. మొన్నటి వరకూ అధికార వైసీపీ అభ్యర్థుల లిస్టు చూసి.. సిట్టింగులు, టికెట్ ఆశించిన వారు అలకబూనారు. కొందరు అధిష్టానం బుజ్జగింపులతో అలకపాన్పు దిగితే.. ఇంకొంతమంది టికెట్ కోసం పార్టీలు మారారు. ఇప్పుడు కూటమిగా ఉన్న టిడిపి, జనసేన, బీజేపీల లక్ష్యం ఒకటే. వైసీపీని గద్దె దించాలి. అందుకోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు నేతలు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లోకి అనుష్క శెట్టి వస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

 

తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించిన అనుష్కశెట్టి.. చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అసలు పేరు స్వీటి శెట్టి అయినా.. సిల్వర్ స్క్రీన్ పై అనుష్కగానే పేరొందింది. సూపర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టినా.. విక్రమార్కుడు సినిమాతో ఆమెకు పేరొచ్చింది. ఆ తర్వాత అరుంధతిలో జేజమ్మగా కనిపించి అలరించింది. బాహుబలి సిరీస్ తో అనుష్క గ్లోబల్ హీరోయిన్ అయింది. బాహుబలి తర్వాత.. భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల్లో నటించింది. ఎక్కువగా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి.. తన నటనకు ప్రశంసలు అందుకున్న స్వీటి.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

అనుష్క జనసేన పార్టీలో చేరి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆమె ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపిందని, రాజకీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉందని సమాచారం. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై స్వీటి ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. ప్రకటన కూడా చేయలేదు. అనుష్క నిజంగానే జనసేనలో చేరితే.. నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మంత్రి రోజాకు పోటీగా నిలబెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగరిలో ఇప్పటికే టిడిపి గాలి భానుప్రకాష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడ మళ్లీ అభ్యర్థిని మార్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. అనుష్క జనసేనలో చేరితే ప్రచారానికే పరిమితమవుతుందా ? మరేదైనా పదవిని కట్టబెడతారా ? మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. అటు జనసేన గానీ, ఇటు అనుష్క గానీ స్పందించాల్సిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |